heaven on the world

Tuesday, 29 November 2016

రుణం తీసుకోండి.. వ్యాపారం చేయండి!

కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్నారా? మీకోసం రుణాలివ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. చిరు, మధ్య తరగతి వ్యాపారులే కాకుండా.. కాస్త పెద్ద వ్యాపారం నిర్వహించడానికీ బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించే లక్ష్యంతో ప్రారంభం అయ్యిందే.. ‘ముద్ర’ (మైక్రో యూనిట్స్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీఫైనాన్స్‌ ఏజెన్సీ). చిన్న, మధ్యస్థాయి వ్యాపారాలను ప్రోత్సహించి, వారికి ఎటువంటి హామీలూ లేకుండా రుణాలు ఇప్పించడం ద్వారా వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమిది. దీని కింద రూ. 10లక్షల వరకూ రుణం పొందే వీలుంది.

ఎవరిని సంప్రదించాలి?
 మీ ప్రాంతంలో ఉన్న ఏ బ్యాంకునైనా.. రుణ సంస్థలనైనా మీరు ఈ రుణం కోసం సంప్రదించవచ్చు. ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్‌, ఆంధ్రాబ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐఓబీ, పీఎన్‌బీ, యూబీఐ తదితర 27 ప్రభుత్వ బ్యాంకులు.. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు తదితర 17 ప్రైవేటు బ్యాంకులు, కో ఆపరేటివ్‌ బ్యాంకులు, రీజనల్‌ రూరల్‌ బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు, బ్యాంకింగేతర రుణ సంస్థల్లో ఎక్కడైనా సరే ఈ రుణాలను పొందేందుకు వీలుంది.

వ్యాపారం ఏమిటి?
ఇప్పటికే మీరు వ్యాపారం చేస్తున్నారా?: రూ.50వేల వరకూ రుణం కావాలా? అయితే, మీరు ఎలాంటి హామీ చూపించకుండానే రుణం పొందే వీలుంది. కేవలం మీ వ్యాపారం గురించి బ్యాంకరు/రుణ సంస్థకు వివరించాలి. ప్రస్తుతం వ్యాపారం నడుస్తున్న తీరు, భవిష్యత్తులో ఆదాయం వృద్ధి ఎలా ఉండబోతోంది తదితర అంశాలను చెప్పాలి.

* రూ.2లక్షలకు మించి రుణం కావాలనుకున్నప్పుడు మీ వ్యాపారానికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు.. ఆదాయపు పన్ను రిటర్నులను కూడా సమర్పించాల్సి ఉంటుంది. గతంలోనూ, ప్రస్తుతం వ్యాపారం ఎలా ఉంది.. మున్ముందు ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు తెలియజేయాలి.

కొత్త వ్యాపారమా?
* మీ వ్యాపారానికి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రాజెక్టు నివేదిక, ఆర్థిక వివరాలు.. వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అయ్యే వ్యయం, అమ్మకాలు, ఆదాయం ఎలా ఉంటుంది.. ఎంత లాభం వస్తుంది తదితర వివరాలన్నీ పేర్కొనాలి.

* వ్యాపార నిర్వహణలో మీ పూర్వానుభవం ఏమిటి? మీరు ఎంచుకున్న వ్యాపారంలో మీ పూర్వానుభవం ఏమిటి అనేది చూస్తారు.

వీటన్నింటితో పాటు.. మీరు తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించగల సామర్థ్యం మీకు ఉందా లేదా అనేదీ బ్యాంకు పరిశీలిస్తుంది. మీ వ్యాపార అవసరాలు.. మీ రోజువారీ ఖర్చులు, మిగులు మొత్తం ఎలా ఉండబోతోంది అనేదీ చూస్తారు.

ఏయే పత్రాలు కావాలి?
వ్యక్తిగత గుర్తింపు : ఓటరు గుర్తింపు కార్డు/ డ్రైవింగ్‌ లైసెన్సు/ పాన్‌ కార్డు/ ఆధార్‌ కారు/ పాస్‌పోర్టు చిరునామా గుర్తింపు: ప్రస్తుత నెల టెలిఫోన్‌ బిల్లు/ విద్యుత్‌ బిల్లు/ ఇంటి పన్ను రశీదు/ ఓటర్‌ గుర్తింపు కార్డు/ ఆధార్‌ కార్డు/ యజమాని(భాగస్వామి, డైరెక్టర్ల) పాస్‌పోర్టు వ్యాపార సంస్థ చిరునామా ధ్రువీకరణ: వ్యాపార నిర్వహణ కోసం తీసుకున్న లైసెన్సులు/ రిజిస్ట్రేషన్‌ లైసెన్సులు/ ఇతర యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు/ ఇతర చిరునామా ధ్రువీకరణ పత్రాలు. దరఖాస్తు చేసే వ్యక్తి ఏ బ్యాంకులోనూ.. రుణ సంస్థలోనూ రుణం తీసుకొని... చెల్లించకుండా ఉండకూడదు.

ఎవరు అర్హులు
* వ్యవసాయేతర వ్యాపారాలు
* సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపార వర్గాలు
* ఆదాయాన్ని సృష్టించే సంస్థలు
* ఉత్పత్తి, సేవలు, వాణిజ్య లావాదేవీలు నిర్వహించేవారు
* రూ.10లక్షల లోపు రుణం అవసరం అయిన వారికి..
* భారతీయులందరికీ ఈ రుణాలు అందుతాయి.

ఏయే వ్యాపారాలు..
పిండి మిల్లులు, టమోటా సాస్‌, స్నానపు సబ్బులు, రైస్‌ ఫ్లేక్స్‌ తయారీ, బనానా ఫైబర్‌ ఎక్ట్రాక్షన్‌, కంప్యూటర్‌ అసెంబ్లింగ్‌, లైట్‌ ఇంజినీరింగ్‌ (నట్లు, బోల్టుల తయారీ), పేపర్‌ ఉత్పత్తులు, బేకరీ ఉత్పత్తులు, స్టీల్‌ ఫర్నిచర్‌, కొబ్బరి పొడి, చెప్పులు, కలప ఫర్నిచర్‌, పేపర్‌ నాప్కిన్లు, పాపడ్‌, పచ్చళ్ల తయారీ, రెడీమేడ్‌ దుస్తులు, నోటు పుస్తకాల తయారీ, పాల ఉత్పత్తులు, డిటర్జెంట్‌ పౌడర్లు, సబ్బులు, సానిటరీ నాప్కిన్ల తయారీ, ఇతర సాధారణ ఇంజినీరింగ్‌ వర్క్‌షాపులు, రబ్బరైజ్డ్‌ కాయిర్‌ మ్యాట్రెస్‌, బ్యూటీ పార్లర్‌ ఇలా అనేక వ్యాపారాలకు ‘ముద్ర’ రుణాలు అందుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా మీరు నిర్వహించాలనుకుంటున్న వ్యాపారానికి సంబంధించిన పూర్తి వివరాలతో మీ దగ్గర్లోని బ్యాంకును సంప్రదించడమే.

వడ్డీ మాటేమిటి?
ముద్ర రుణాలపై వడ్డీ బ్యాంకుల ప్రామాణిక వడ్డీ రేటు (బేస్‌ రేటు) మీద ఆధారపడుతుంది. రుణాలను ఇవ్వడానికి బ్యాంకులు ఎలాంటి పరిశీలనా రుసుములను వసూలు చేయవు. గడువుకన్నా ముందుగానే చెల్లించినా.. ఎలాంటి రుసుమూ ఉండదు. దరఖాస్తు చేసుకున్న తర్వాత సాధారణ పరిస్థితుల్లో 7-10రోజుల వ్యవధిలో బ్యాంకులు రుణాన్ని మంజూరు చేస్తాయి. ఒకవేళ తిరస్కరిస్తే కారణాలను లిఖిత పూర్వకంగా తెలియజేస్తాయి. రుణ వాయిదాలను సకాలంలో చెల్లించకపోతే.. 1శాతం వార్షిక రుసుము చెల్లించాలి.

ఇబ్బంది ఎదురైతే..: రుణం మంజూరు విషయంలో మీకేదైనా ఇబ్బంది ఎదురైతే.. ఆంధ్రప్రదేశ్‌: 18004251525, తెలంగాణ: 18004258933 నెంబర్లలో సంప్రదించవచ్చు. MSME Development Center, C-11, G-Block, BandraKurla Complex, Bandra (E), Mumbai –400 051, Contact: 022- 2654 0028, Email id ceo@mudra.org.inకు ఫిర్యాదు చేయవచ్చు.

No comments:

Post a Comment